రైతుల తరపున గొంతు వినిపిస్తా
రైతు సంఘాల నేతలతో రాహుల్
న్యూఢిల్లీ – కాంగ్రెస్ అగ్ర నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో తనను కలుసుకున్న రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా వారిని లోపలికి రానివ్వక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. వారు ఏమైనా తీవ్రవాదులా అని ప్రశ్నించారు.
కేంద్రంలో కొలువు తీరిన మోడీ బీజేపీ సర్కార్ మొదటి నుంచీ ధనవంతులకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తోందని, అందుకే బడ్జెట్ కూడా వారికి అనుకూలంగా ఉందన్నారు. కానీ తర తరాల నుంచి కోట్లాది మంది ప్రజలకు ఆకలి తీరుస్తున్న రైతుల వెతలు పట్టించు కోవడం లేదని ఆరోపించారు.
రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించాలని తాను పార్లమెంట్ లో లేవదీస్తానని, రైతుల గొంతు వినిపిస్తానని చెప్పారు. రైతులు చేపట్టే ఏ ఆందోళనకైనా తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
గతంలో జరిగిన రైతుల ఆందోళనకు తమ పార్టీ బేషరతు మద్దతు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు రాహుల్ గాంధీ. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.