గుజరాత్ నమూనా మోసానికి చిరునామా
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
గుజరాత్ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. గుజరాత్ మోడల్ పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 143 కోట్ల మంది భారతీయులను నిట్ట నిలువునా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం కులం, మతం, విద్వేషం ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ్ యాత్ర గుజరాత్ లోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వేలాది మంది తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్వవాదాలు తెలిపారు.
గుజరాత్ లో సామాజిక విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలపై ప్రతి రోజూ దాడులు కొనసాగుతున్నాయని దీనిని నిలుపుదల చేయడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.
పరీక్షలు సైతం సక్రమంగా నిర్వహించ లేని స్థితిలో ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ దేశంలో ఉన్న వనరులన్నింటిని గంప గుత్తగా తాబేదారులు, బడా బాబులకు కట్టబెట్టే ఆలోచనలో మోదీ ఉన్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ.