NEWSNATIONAL

సెబీ చైర్ ప‌ర్స‌న్ రాజీనామా చేయాలి

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఎంపీ రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ – లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు , ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న వీడియో షేర్ చేశారు. సెబీ చైర్ ప‌ర్స‌న్ మాధ‌వి పూరీ బుచ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అదానీ గ్రూప్ కంపెనీల‌లో త‌న‌తో పాటు భ‌ర్త ఎలా పెట్టుబ‌డులు పెడ‌తారంటూ ప్ర‌శ్నించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

ఇందుకు బాధ్య‌త వ‌హిస్తూ సెబీ చైర్ ప‌ర్స‌న్ వెంట‌నే రాజీనామా చేయాల‌ని అన్నారు రాహుల్ గాంధీ. చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ అయిన సెబీ సమగ్రత దాని చైర్ పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీ పడిందన్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న నిజాయితీగల పెట్టుబడిదారులకు మోడీ స‌ర్కార్ ఏం స‌మాధానం చెబుతుంద‌ని ప్ర‌శ్నించారు. హిండెన్ బ‌ర్గ్ నివేదిక‌లో ఆధారాల‌తో స‌హా సెబీ చైర్ ప‌ర్స‌న్ గురించి తెలియ చేశార‌ని పేర్కొన్నారు.

పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటే, ఎవరు జవాబుదారీగా ఉంటారని నిల‌దీశారు. ఇందుకు పూర్తిగా ప్ర‌ధాన మంత్రి మోడీ, వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ, సెబీ చైర్ ప‌ర్స‌న్ బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ.