ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీలు
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన గత కొంత కాలం నుంచీ ప్రజల గొంతుక వినిపిస్తున్నారు. తనపై వేటు వేసినా , చివరకు కోర్టుల చుట్టూ తిప్పినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. 100 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో కీలకమైన పాత్ర పోషించారు.
ఒకానొక దశలో ఏఐసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన హయాంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా అపజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. దీంతో మనస్థాపానికి గురయ్యారు. తనకు పార్టీ పదవి వద్దంటూ రాజీనామా చేశారు. అక్కడి నుంచి మౌనంగా ఉన్నారు. ప్రజలకు, దేశానికి, కుటుంబానికి దూరంగా ఇతర దేశాలకు వెళ్లి పోయారు.
కానీ ఫీనిక్స్ పక్షి లాగా తిరిగి వచ్చారు. రాజకీయాలలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చోదక శక్తిగా మారారు. దట్టించిన తూటాలా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ జీవం పోసుకుంది. తాజాగా 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకోగలిగింది. ఆయన భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు.