వాయనాడు లో రాహుల్ నామినేషన్
తరలివచ్చిన అశేష ప్రజానీకం
వాయనాడు – కేరళలోని వాయనాడు లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ , ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన దరఖాస్తును ఎన్నికల రిటర్నింగ్ అధికారిణికి అందజేశారు.
అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. తనను ఆదరిస్తూ వచ్చిన వాయనాడు ప్రజానీకానికి రుణపడి ఉన్నానని చెప్పారు. వాయనాడు ఒక ప్రాంతమే కాదని ఇక్కడి వాతావరణం, ప్రజలు తన కుటుంబమని స్పష్టం చేశారు.
వారి నుండి తాను గత ఐదు సంవత్సరాలుగా చాలా నేర్చుకున్నానని చెప్పారు రాహుల్ గాంధీ. ప్రేమ, కరుణ, దయ, స్నేహం, బంధం , ఆప్యాయత, అనురాగాన్ని ఇక్కడి ప్రజల నుంచి తనకు లభించిందని కొనియాడారు . ఎంతో గర్వంతో , వినయంతో నేను ఈ సుందరమైన ప్రాంతం నుంచి మరోసారి ఎంపీగా బరిలో ఉన్నానని తెలిపారు.
ప్రస్తుతం జరగబోయే ఈ ఎన్నికలు నీతికి, అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ద్వేషం, అవినీతి, అన్యాయ శక్తుల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు.