వాయనాడుకు రుణపడి ఉన్నా
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
కేరళ – తన జీవితంలో మరిచి పోలేని ప్రాంతం ఏదైనా ఉందంటే వాయనాడు అని కొనియాడారు ఏఐసీసీ మాజీ చీఫ్ , ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా బరిలో ఉన్న రాహుల్ గాంధీ. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాయనాడులో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మానవ, జంతు సంఘర్షణ సమస్య వాయనాడు ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. దీని గురించి తాను పలుమార్లు కేంద్ర సర్కార్ కు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశానని చెప్పారు రాహుల్ గాంధీ. ప్రధానంగా రాత్రి పూట రాక పోకలను నిషేధించడం కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని తనకు తెలుసన్నారు.
ఈ సమస్య పరిష్కారానికి తాను ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ ను సంప్రదించడం జరిగిందని చెప్పారు. మరోసారి ఒత్తిడి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు రాహుల్ గాంధీ. ఈసారి జరిగే ఎన్నికల్లో మోదీకి పరాజయం తప్పదని హెచ్చరించారు.