వయనాడ్ నుంచి ప్రియాంక బరిలో
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన కీలక ప్రకటన చేశారు. తాను వయనాడు లోక్ సభ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ.
ఇదిలా ఉండగా 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని అమేథి లోక్ సభ స్థానంతో పాటు కేరళ లోని వాయనాడు నుంచి కూడా పోటీ చేశారు రాహుల్ గాంధీ. అయితే ఆనాడు స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు రాహుల్. కాగా వాయనాడు ఎంపీ స్థానంలో గెలుపొందారు.
దీంతో తను ఎక్కువగా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. అక్కడి ప్రజలకు ఆయన ఆత్మీయుడిగా మారి పోయారు. తాజాగా ఈ ఏడాది 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు రాహుల్ గాంధీ. తన తల్లి సోనియా గాంధీకి బదులు తను రాయ్ బరేలి నుంచి బరిలో నిలిచారు. అంతే కాకుండా సిట్టింగ్ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు చోట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఇదిలా ఉండగా రెండు సీట్లలో ఏదో ఒకటి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో చివరకు తనను ఆదరించిన వయనాడును వదిలేశారు రాహుల్ గాంధీ. ఈ స్థానం నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ బరిలో ఉంటారని సమాచారం.