మోదీ జిమ్మిక్కులు పని చేయవు
తమిళ సంస్కృతి గొప్పది
తమిళనాడు – ప్రధానమంత్రి జిమ్మిక్కులు, మ్యాజిక్కులు పని చేయవంటూ ఎద్దేవా చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. శుక్రవారం ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్బంగా ఇండియా కూటమి తరపున జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ దేశంలో తమిళనాడు ప్రాంతానికి ప్రత్యేకత ఉందన్నారు. పెరియార్ రామస్వామి నాయకర్ , అన్నా దురై, కామరాజ్ నాడర్ , కలైంజర్ కరుణానిధి వంటి గొప్ప వ్యక్తులను ఈ ప్రాంతం మనకు అందించిందని చెప్పారు. ఇది భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం పోరాడేందుకు శక్తిని, అంతకు మించిన ప్రేరణ ఇచ్చిందని చెప్పారు రాహుల్ గాంధీ.
మన ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రస్తుతం మనందరిపై ఉందన్నారు. ఇక దేశంలో తాను ఒక్కడినే ఉండాలని అనుకుంటున్న మోదీ ప్రయత్నం ఫలించదని అన్నారు. వ్యవస్థలో అందరికీ సమాన హక్కులు ఉంటాయన్న సోయి లేకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించారు.