హస్తం రైతన్నలకు నేస్తం
అన్ని విధాలుగా ఆదుకుంటాం
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా సరే అష్ట కష్టాలు పడైనా సరే అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకుంటామని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని యూపీలోని రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రైతులను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. వారి పాలిట శాపంగా మారారని ఆవేదన చెందారు. వారిని ఇబ్బందికి గురి చేసేలా మూడు నల్ల చట్టాలు తీసుకు వచ్చారని ఆరోపించారు.
ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. ఆయనకు పేదలు, మధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగుల సమస్యలు పట్టవన్నారు. కానీ తాము పవర్ లోకి వచ్చాక రైతుల కు అండగా ఉంటామని చెప్పారు రాహుల్ గాంధీ.
రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. రుణాలను మాఫీ చేస్తామని, జీఎస్టీ రహిత వ్యవసాయం అందుబాటులోకి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. 30 రోజుల లోపు పంట బీమా చెల్లిస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ.
అంతే కాకుండా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తామన్నారు, యువతకు రూ.లక్ష మొదటి ఉద్యోగం కల్పించడంతో పాటు నేరుగా రైతు కుటుంబాలకు కూడా మేలు జరుగుతుందన్నారు.