ఊపిరి ఉన్నంత దాకా పోరాడుతా
బీజేపీపై యుద్దం తప్పదన్న రాహుల్
కేరళ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళ లోని కొట్టాయంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం, ప్రజల కోసం తన గొంతు వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూనే ఉంటానని ప్రకటించారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు.
తమ కుటుంబం ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసిందన్నారు. తన నాయినమ్మ, తన తండ్రి ప్రాణాలు కోల్పోయారని , తనకు కూడా ప్రాణం అంటే భయం లేదని చెప్పారు రాహుల్ గాంధీ. బీజేపీతో యుద్దం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. దానికి విరామం అన్నది లేనే లేదన్నారు.
కాషాయ భావ జాలం దేశానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు వాయనాడు సిట్టింగ్ ఎంపీ. ఇకనైనా ప్రజలు మేల్కోవాలని లేక పోతే ఇబ్బందులు తప్పవన్నారు.