వాయనాడు బాధితులందరినీ ఆదుకుంటాం
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ
కేరళ – కేరళలోని వాయనాడులో చోటు చేసుకున్న విషాదం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ. ఇప్పటికే ప్రకృతి విపత్తు కారణంగా కొండ చరియలు విరిగి పడి ఏకంగా 287 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిగా గాయపడ్డారు. ఈ విపత్తు తననే కాదు యావత్ దేశాన్ని విస్తు పోయేలా చేసిందన్నారు. ఇలాంటి విపత్తు తన జీవిత కాలంలో చూడలేదన్నారు.
ఏది ఏమైనా ఇలాంటిది మరోసారి జరగకుండా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. తనతో పాటు సోదరి ప్రియాంక గాంధీ కూడా బాధితులను, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడం జరిగిందన్నారు. హృదయాలు బరువుతో నిండి పోయాయని చెప్పారు రాహుల్ గాంధీ.
శుక్రవారం ఆయన తన సోదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈసారి వాయనాడ్‌లో సంభవించినంత విధ్వంసాన్ని కేరళ ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈ విషాదం ప్రత్యేకమైన, తక్షణ ప్రతిస్పందనను కోరుతున్నందున తాను ఈ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ఇక్కడ 100కు పైగా ఇళ్లను కట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని ప్రకటించారు. అంతే కాకుండా బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.