NEWSNATIONAL

నా కామెంట్స్ ను బీజేపీ వ‌క్రీక‌రిస్తోంది

Share it with your family & friends

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

ఢిల్లీ – లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, రాయ్ బ‌రేలి ఎంపీ రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తూ ప్ర‌జ‌ల‌లో గంద‌ర‌గోళానికి దారి తీసేలా బీజేపీ నేత‌లు, మంత్రులు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను భారతదేశంలో, విదేశాలలో ఉన్న ప్రతి సిక్కు సోదరుడిని ,సోదరిని అడగాలనుకుంటున్నాను – నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా అని ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ. ప్రతి సిక్కు , ప్రతి భారతీయుడు తమ మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశం భారతదేశం కాదా అని నిల‌దీశారు.

ఎప్పటిలాగే బీజేపీ అబద్ధాలను ఆశ్రయిస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. వారు సత్యాన్ని సహించలేక నన్ను మౌనంగా ఉంచాలని తహతహ లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కానీ భారతదేశాన్ని నిర్వచించే విలువల కోసం నేను ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

భిన్నత్వం, సమానత్వం, ప్రేమ‌లోనే మన ఏకత్వం దాగి ఉంద‌ని చెప్పారు రాహుల్ గాంధీ. తాజాగా రాహుల్ చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.