రూ. 3 లక్షల కోట్ల రుణాలు మాఫీ
బడా వ్యాపారవేత్తలకు మోదీ లబ్ది
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఈ దేశంలో మోదీ ప్రధానమంత్రిగా కొలువు తీరాక దేశంలోని వనరులను అన్నింటిని దారదత్తం చేసే పనిలో పడ్డారంటూ ఆరోపించింది. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు రూ. 3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, ఇది ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు చేశారో 143 కోట్ల భారతీయులకు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రోజు రోజుకు దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం , వ్యవసాయం రంగం కుదేలవుతున్నా పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. ప్రచారంపై ఉన్నంత ధ్యాస ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లేదని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.
ప్రజలు ఎల్లకాలం మోసాలను, అబద్దాలను నమ్మ బోరని, త్వరలోనే అది ఓట్ల రూపంలో షాక్ ఇవ్వక తప్పదని గుర్తించాలని హెచ్చరించారు. మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లను దండు కోవాలనే దురాశ అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యాంగమే కాదు ప్రజాస్వామ్యం కూడా ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.