మోదీ మోసం దేశానికి శాపం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
తమిళనాడు – కేవలం ప్రచారం తప్ప దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చేసింది ఏమీ లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి తరపున డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా తమిళనాడులో భారీ ఎత్తున సాదర స్వాగతం లభించింది రాహుల్ గాంధీకి. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఇక్కడి నుంచి మంచి స్పందన లభించిందని గుర్తు చేశారు.
తమిళుల వారసత్వం అత్యంత గొప్పదన్నారు. ఈ దేశానికి, ప్రపంచానికి గొప్ప వ్యక్తులను, మహానుభావులను, సంఘ సంస్కర్తలను అందించిన పుణ్య భూమి ఇది అంటూ తమిళనాడు రాష్ట్రంపై ప్రశంసల జల్లులు కురిపించారు.
తన తండ్రిని కోల్పోయింది ఇక్కడే. కానీ తెలిసో తెలియకో తప్పు చేసిన వారికి క్షమాభిక్ష ప్రసాదించాలని డీఎంకే చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ కోరారని తాము వెంటనే ఓకే చెప్పామని అన్నారు రాహుల్ గాంధీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ విద్వేష పూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.