సైనికులను కూలీలుగా మార్చిన మోదీ
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత రాహుల్
హర్యానా – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ప్రైవేట్ పరం చేసే దిశగా తను నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఎన్నడూ లేని రీతిలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి పోయిందని వాపోయారు.
ఇప్పటి వరకు మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హర్యానా లోని మహేంద్ర నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
దేశంలోని యువత దేశ సరిహద్దులను గత వందేళ్లుగా కాపాడుతూ వస్తోందన్నారు. కానీ వారి కలలను చిదిమి వేశారని, భవిష్యత్తును నాశనం చేశారంటూ వాపోయారు రాహుల్ గాంధీ. మీ అందరి హృదయాలలో దేశ భక్తి భావన ఉందని, కానీ మోడీ అగ్నివీర్ పథకాన్ని ప్రవేశ పెట్టి భారత సైనికులను కూలీలుగా మార్చాడంటూ మోదీపై సంచలన ఆరోపణలు చేశారు .
తమ సర్కార్ రాగానే అగ్నివీర్ ను రద్దు చేస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ.