కుల గణన పట్ల కేంద్రం వివక్ష
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ పేరుకు తాను బీసీనని చెప్పుకుంటారని, ఇది కేవలం ప్రచారం కోసం, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత ఆయన ఉన్నత వర్గాలకు వత్తాసు పలుకుతారని, వారికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటారని మండిపడ్డారు.
అక్రమార్కుల భరతం పడతానని , జన్ ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తానని, ప్రతి ఏటా 2 కోట్ల జాబ్స్ భర్తీ చేస్తానని మోస పూరితమైన హామీలు ఇచ్చారని, కానీ వీటిలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు రాహుల్ గాంధీ. ప్రధానంగా పదేళ్లవుతున్నా ఎందుకని కుల గణన చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు.
తాము గనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే తక్షణమే కుల గణన చేపడతామని ప్రకటించారు వాయనాడు ఎంపీ. దేశ బడ్జెట్‌లో ప్రతి రూ 100కి, జనాభాలో మూడింట రెండు వంతుల వాటా రూ. 6 మాత్రమే ఉందన్నారు. ఈ వర్గానికి జరుగుతున్న ఘోరమైన అన్యాయం దేశాన్ని పలచన చేసేలా చేస్తోందన్నారు.
అందుకే, దేశాన్ని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ రెండు విప్లవాత్మక అడుగులు వేయబోతోందన్నారు. కుల గణనతో పాటు దేశంలో వనరులు, ఎవరి వద్ద ఎంత సంపద పోగై ఉందనే విషయం ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
అణగారిన జనాభాలో మూడింట రెండొంతుల మందిని దేశ ప్రగతిలో భాగస్వాములను చేయకుండా భారతదేశ శ్రేయస్సు అసాధ్యమని అన్నారు రాహుల్ గాంధీ.