రైతన్నలకు రాహుల్ భరోసా
పవర్ లోకి వస్తే ఆర్థిక సాయం
న్యూఢిల్లీ – ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు పూర్తి భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. వారికి కనీస మద్దతు ధర ఇప్పిస్తామన్నారు. ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని గత కొన్నేళ్లుగా అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవున్నారు. మోదీ తాబేదారులకు , వ్యాపారస్తులకు, కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూరేలా ప్రయత్నం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.
భారత వ్యవసాయానికి చేసిన భారీ నష్టం గురించి ఏకరవు పెట్టారు. మోదీ పీఎంగా కొలువు తీరాక బడా సంస్థలకు సంబంధించి రుణాలు మాఫీ చేశారని, కానీ కష్టపడే రైతులకు మాత్రం భారం మోపాడంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
తాము గనుక అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామని, ఇందుకు సంబంధించి శాశ్వత కమిషన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.