కాషాయం దేశానికి ప్రమాదం – రాహుల్ గాంధీ
ఆర్ఎస్ఎస్..బీజేపీపై భగ్గుమన్న కాంగ్రెస్ నేత
యుఎస్ఏ – అమెరికా పర్యటనలో ఉన్న లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అక్కడి మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిప్పులు చెరిగారు. భారత దేశంలో కాషాయ సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ప్రధానంగా ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, ఏబీవీపీ లాంటి కాషాయ సంస్థలను ప్రత్యేకంగా ఉదహరించారు రాహుల్ గాంధీ. అభివృద్దిని అడ్డుకోవడం తప్ప సదరు సంస్థలు దేశానికి చేసింది ఏమీ లేదన్నారు కాంగ్రెస్ అగ్ర నేత.
వ్యవస్థలను ఇప్పటికే నిర్వీర్యం చేశారని , ఇవాళ ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు . ఇది ఎంత మాత్రం దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
ఎంత సేపు భక్తి, ఆధ్యాత్మికం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ప్రచారం కోసం తప్ప దేశం కోసం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏ మాత్రం చొరవ చూపడం లేదని మండిపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దేశానికి భారంగా మారారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ.