కేంద్రం నిర్వాకం రైతులకు శాపం
రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టిన రైతుల పట్ల కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోందని ఆవేదన చెందారు.
రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రికి ప్రచారంపై ఉన్నంత మక్కువ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చూపడం లేదంటూ మండిపడ్డారు. కేవలం తమ స్వ ప్రయోజనాలకు ప్రయారిటీ ఇచ్చే సంస్థలు, వ్యక్తులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు.
ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా సైతం మోదీ మాయలో చిక్కుకు పోయిందన్నారు. ఇవాళ వేలాది మంది రైతులు ఢిల్లీ వద్దకు వచ్చారని, వారు తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం మాత్రమే పోరాడుతున్నారని అన్నారు. వారు పండించిన పంటకు కనీస మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దేశం అభివృద్ది చెందిందన్నారు. బ్యాంకుల జాతీయ కరణ, పరిశ్రమల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యా రంగంలో కీలక మార్పులు తీసుకు వచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు.