ఫలితాలు ఆశ్చర్యకరం పోరాటం ఆపం
స్పష్టం చేసిన ఎంపీ రాహుల్ గాంధీ
ఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలపై స్పందించారు. బుధవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఇరు రాష్ట్రాల ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇండియా కూటమి సాధించిన విజయం రాజ్యాంగ విజయం, ప్రజాస్వామ్య ఆత్మగౌరవ గెలుపుగా అభివర్ణించారు రాయ్ బరేలి ఎంపీ.
అయితే ఇదే సమయంలో హర్యానాలో ఊహించని ఫలితాలపై ఆత్మావ లోకనం చేసుకుంటున్నామని తెలిపారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి తెలియ చేస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
మద్దతు ఇచ్చినందుకు హర్యానా ప్రజలందరికీ, అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మా బబ్బర్ షేర్ కార్మికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ఇదే సమయంలో హక్కుల కోసం, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం, సత్యం కోసం ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ.