రాజస్థాన్ రాయల్స్ మహిళలకు సాయం
పింక్ ప్రామిస్ పేరుతో మహిళా సాధికారత
జైపూర్ – రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రానికి చెందిన మహిళల్లో సాధికారత సాధించేలా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2024లో లీగ్ మ్యాచ్ సందర్భంగా విక్రయించే ప్రతి టికెట్ పై రూ. 100 మహిళల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ అసాధారణమైన నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు కోట్లాది మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ టీం యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తుతున్నారు.
అంతే కాదు ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి పింక్ ప్రామిస్ అని పేరు కూడా పెట్టారు. జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ ను పూర్తిగా మహిళల కోసం అంకితం చేశారు. అంతే కాదు తమ జట్టులో ఆడుతున్న ఆటగాళ్లు ఎన్ని సిక్సర్లు కొడితే అంత బహుమానం కూడా ప్రకటించింది మేనేజ్ మెంట్ .
ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారించాయి ఇరు జట్లు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి 184 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్లు కోల్పోయి ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే పని కానిచ్చేసింది. జోస్ బట్లర్ 4 సిక్సర్లు కొడితే కెప్టెన్ శాంసన్ 2 భారీ సిక్సర్లతో దుమ్ము రేపాడు.