NEWSTELANGANA

ఫోర్త్ సిటీ స‌రే ప్ర‌జా స‌మ‌స్య‌ల మాటేంటి..?

Share it with your family & friends

బీఆర్ఎస్ నేత అనుగుల రాకేష్ రెడ్డి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత అనుగుల రాకేష్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణ‌యాల ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు.

ప్ర‌ధానంగా ప‌దే ప‌దే సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ అంటూ చెబుతుండ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఓ వైపు ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించ‌కుండా రియ‌ల్ ఎస్టేట్ కు ఊతం ఇచ్చేలా మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు అనుగుల రాకేష్ రెడ్డి.

అస‌లు తెలంగాణలో అసలు నగరాలు లేనట్టు, జనం అల్లాడుతున్నట్టు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ని నిర్మాణం చేస్తామ‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఎక్కడైనా ప్రభుత్వాలు నగరాలను నిర్మాణం చేస్తాయా అని నిల‌దీశారు రాకేశ్ రెడ్డి.

కొత్తగా నిర్మాణాలు, జాగా అవసరం అయినప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ బిల్డర్ లు కానీ చూసుకుంటారని ఇది స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌య‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం చేయాల్సిన వాటిని ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌ల‌ను ఇత‌ర స‌మ‌స్య‌ల వైపు మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు.

ఒక‌వేళ ప్ర‌త్యామ్నాయ న‌గ‌రాల‌ను అభివృద్ది చేయాల‌ని అనుకుంటే వ‌రంగ‌ల్ లాంటి న‌గ‌రాన్ని అభివృద్ది చేయొచ్చ‌ని స‌ల‌హా ఇచ్చారు. ఏపీలో అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డ‌తాన‌ని చంద్ర‌బాబు చెప్పాడో ఇక్క‌డ రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీని నిర్మించాల‌ని అనుకుంటున్నారా అని సెటైర్ వేశారు.

ఫార్మా సిటీ కోసం రైతుల దగ్గర నుండి తీసుకున్న భూమిని రియల్ ఎస్టేట్ కోసం ఎలా వాడుతారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అనుగుల రాకేష్ రెడ్డి. అయితే ఫార్మా సిటీ కోసం అయినా వాడాలి లేదా రైతుల భూములు రైతులకు ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్ నగరాల్లో ఫ్లైఓవర్ లు, డబల్ రోడ్ లు, కొత్త కలెక్టరేట్ లు, ప్రతి ఊరికి నర్సరీ లు, పార్క్ లు, డంపింగ్ యార్డ్ లు, స్మశాన వాటికలు నిర్మాణం చేసి అన్ని నగరాలను, గ్రామాలను అభివృద్ధి చేస్తే మీరేమో రియల్ ఎస్టేట్ చేయడానికి నాల్గవ నగరం నిర్మాణం చేస్తారా అని మండిప‌డ్డారు అనుగుల రాకేశ్ రెడ్డి.