దేశ పుత్రికను ఎవరూ ఓడించ లేరు
వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు దారుణం
ఉత్తర ప్రదేశ్ – రైతు ఉద్యమ నేత, కిసాన్ మోర్చా చీఫ్ రాకేశ్ టికాయత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2024 పోటీలలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరుకున్న ఇండియాకు చెందిన రెజ్లర్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు వేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా రాకేశ్ టికాయట్ స్పందించారు. వినేష్ ఫోగట్ నిజమైన భూమి పుత్రిక అని ఆమెను ఎవరూ ఓడించ లేరంటూ స్పష్టం చేశారు. కానీ కుట్రల రంగంలో మాత్రం ఓడి పోయారంటూ వాపోయారు రైతు సంఘం నేత.
ఇది చాలా బాధకరమైన విషయం. యావత్ భారత దేశానికి చెందిన ప్రజలంతా తను బంగారు పతకంతో తిరిగి వస్తుందని ఆశించారని, కానీ విధి తనను ఇలా ఆడుకుంటుందని తాను అనుకోలేదని పేర్కొన్నారు రాకేశ్ టికాయత్. దేశపు పతకం ఇవాళ రాజకీయాలకు బలై పోయిందని మండిపడ్డారు. అయితే ఆగస్టు 7వ తేదీని భారత దేశం ఎప్పటికీ మరిచి పోదని కుండ బద్దలు కొట్టారు రైతు సంఘం నాయకుడు.