ఖాకీల జులం టికాయత్ ఆగ్రహం
మరో పోరాటం తప్పదన్న రైతు నేత
బీహార్ – రైతు ఉద్యమ నాయకుడు, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయత్ సీరియస్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాను సందర్శించారు. బనార్ పూర్ చౌసా గ్రామంలో లాఠీ ఛార్జీలో గాయపడిన రైతులను , బాధిత కుటుంబాలను కలిశారు.
ఈ సందర్బంగా రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడారు. భూ సేకరణ కోసం పోరాడుతున్న రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం మంచి పద్దతి కాదన్నారు. ఈ దేశంలో రైతులకు , పండించిన పంటలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవాన్ని చంపుకుని తలవంచే పరిస్థితి రాదన్నారు.
రైతులు ప్రాణం పోయినా సరే పోరాటంలో ముందుంటారని స్పష్టం చేశారు రాకేశ్ టికాయత్. రైతులపై అకారణంగా లాఠీ ఛార్జీకి పాల్పడిన ఖాకీలపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీహార్ రైతులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశ వ్యాప్తంగా భారీ ర్యాలీ చేపడతామని ప్రకటించారు . మరో రైతు ఉద్యమానికి ఇది నాంది పలకనుందని ప్రకటించారు టికాయత్.