కేసులు నమోదు చేయడం చట్ట విరుద్దం
ఏపీ హైకోర్టులో ఆర్జీవీ మరో పిటిషన్
అమరావతి – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి చర్చనీయాంశంగా మారింది. తనపై వరుసగా కేసులు నమోదు కావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది పూర్తిగా చట్ట విరుద్దమని పేర్కొన్నారు. గురువారం ఆర్జీవీ మరో పిటిషన్ ను ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు.
తనకు స్వేచ్ఛగా అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు హక్కు ఉందని , ఇది భారత రాజ్యాంగం కల్పించిన అవకాశమని పేర్కొన్నారు. దీనిని కాదనేందుకు ఎవరికీ హక్కు లేదన్నారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడంలో భాగంగానే తనపై వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కావాలని ఫిర్యాదులు చేస్తున్నారంటూ ఆరోపించారు రామ్ గోపాల్ వర్మ.
తాను ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులను ఆధారంగా చేసుకుని కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. చట్ట విరుద్దంగా ఒకే విషయంపై ఇన్ని కేసులు నమోదు చేస్తారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు ఆర్జీవీ. రాష్ట్రమంతటా కేసులు నమోదు చేయడం పూర్తిగా చట్ట విరుద్దమని పేర్కొన్నారు .
ఇక నుంచి ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి దాకా తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోరారు. ఇదిలా ఉండగా ఈ పిటిషన్ కు సంబంధించి ఇవాళ విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.