అరెస్ట్ పై అత్యుత్సాహం ఆర్జీవీ ఆగ్రహం
బయటకు వచ్చి మాట్లాడిన దర్శకుడు
హైదరాబాద్ – తాను తప్పించుకు తిరుగుతున్నానంటూ , అరెస్ట్ చేస్తారని భయపడ్డానంటూ చేస్తున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సోమవారం ఆర్జీవీ ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియాతో మాట్లాడారు.
అరెస్ట్ చేసే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తనపై కూడా ఎన్నో మీమ్స్ , కామెంట్స్ , విమర్శలు, ఆరోపణలు, దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటారని వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు ఆర్జీవీ.
తన అరెస్ట్ విషయంలో ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు . తనపై నమోదైన కేసులకు సంబంధించి ఉద్దేశ పూర్వకంగా ఉన్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. వ్యంగ్యం అనే దానికి ప్రతి చోటా ఉంటుందన్నారు. ఇది మీడియాలో తప్పనిసరిగా మిళితమై ఉంటుందని, దానిని అర్థం చేసుకోవడంలో ఒక్కోరికి ఒక్కోలా ఉంటుందంటూ పేర్కొన్నారు.
సినిమా విడుదలైన ఏడాది తర్వాత కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా కక్ష సాధింపు తప్ప మరోటి కాదన్నారు.