NEWSANDHRA PRADESH

ఏపీఎంసీ చైర్మ‌న్ గా రామ్మోహ‌న్ నాయుడు

Share it with your family & friends

ఏకగ్రీవంగా ఎన్నుకున్న 40 సభ్య దేశాల ప్రతినిధులు

ఢిల్లీ – ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ , కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడుకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో సభ్య దేశాల ఛైర్మన్ ఎన్నిక బుధవారం నిర్వహించారు.

ఇందులో ఏపీఎంసీ చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజార‌పు రామ్మోహన్ నాయుడు ను సింగపూర్ దేశం ప్రతిపాదించ‌గా భూటాన్ దేశం మద్దతు ప‌లికింది.

దీంతో ఆయా దేశాల ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రామ్మోహ‌న్ నాయుడు మాట్లాడార‌.

భార‌త దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు సభ్య దేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.

ఆకాశ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పౌర విమానయానాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకు వస్తానని స్ప‌ష్టం చేశారు.