ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం
ప్రకటించిన కూటమి రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల ప్రచారంలో టీడీపీ చీఫ్ , సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గనుక అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు.
ఈ సందర్బంగా ఆదివారం ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రామ్ ప్రసాద్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఆయన తీపి కబురు చెప్పారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఉచిత జర్నీకి సంబంధించి విధి విధానాలను తయారు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు ఏపీ మంత్రి. ఎలాంటి లోటు పాట్లు జరగకుండా చూస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇటు కర్ణాటకలో అటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.