తిరుమల ప్రసాదంపై రమణ దీక్షితులు కామెంట్
చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ తరుణంలో బాబు వ్యాఖ్యలను సమర్థించేలా మాట్లాడారు రమణ దీక్షితులు. ఆయనపై గత ప్రభుత్వం కక్ష కట్టింది. ఆపై తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
కోట్లాది మందికి ప్రీతి పాత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదమని పేర్కొన్నారు. శుక్రవారం రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోందని అన్నారు.
ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రమణ దీక్షితులు . ఆగమం పైన పట్టు ఉన్న వారిని స్వామి వారికి సేవ చేసే అవకాశం సీఎం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దారుణాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాజాగా రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.