కళ్లు చెదిరే డిజైన్లు కురిపిస్తున్న కోట్లు
ఎవరీ రామకృపా అనంతన్ ఏమిటా కథ
హైదరాబాద్ – కొన్ని కథలు సాధారణంగా ఉంటాయి. మరికొన్ని అసాధారణంగా అనిపిస్తాయి. ఇంకొన్ని గుండెల్ని హత్తుకుంటాయి. కళ్లు చెదిరేలా..మనస్సు దోచుకునేలా డిజైన్లు తయారు చేస్తే కాసులు కురిపిస్తాయని నిరూపిస్తోంది భారత దేశానికి చెందిన ఆటో మొబైల్ ఇండస్ట్రీలోని వాహనాల డిజైనర్ కృపా. ఆమె అసలు పేరు రామకృపా అనంతన్. 1971లో పుట్టారు. ఇండియన్ కార్ డిజైనర్ గా గుర్తింపు పొందారు. యావత్ ప్రపంచం విస్తు పోయేలా ఆమె తయారు చేసిన డిజైన్లు తళుక్కుమంటున్నాయి. ప్రధానంగా వాహనాల తయారీ పరిశ్రమలో పురుషులదే ఆధిపత్యం. కానీ వారందరిని తలదన్నేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు కృపా.
కార్ డిజైనర్లకు ఒకప్పుడు అంతగా డిమాండ్ ఉండేది కాదు. ఎప్పుడైతే తను మహీంద్రా కంపెనీకి సంబంధించి వాహనాలను డిజైన్ చేసిందో వాటి అమ్మకాలు ఉన్నపళంగా పెరిగాయి. చైర్మన్ , సీఈవో ఆనంద్ మహీంద్రా సైతం ఆశ్చర్య పోయేలా చేశారు కృపా. దీనికంతటికీ కారణం ఆమెలోని క్రియేటివిటీనేనని చెప్పక తప్పదు. కార్ డిజైనర్ అని తేలికగా తీసి పారేస్తే ఊరుకోదు. ఎందుకంటే తాము కూడా నిద్రహారాలు మాని డిజైన్లు తయారు చేస్తామని, ఒక రకంగా తాము కూడా చిత్రకారులమేనని చెబుతోంది.
వాళ్లు కాగితాల మీద అందంగా గీతలు గీస్తారు. కానీ మేం అలా కాదు వాటికి ప్రాణం పోస్తాం. అదే తేడా..కానీ
కళాత్మకంగా చూస్తే ఇద్దరం ఒక్కటేనని అంటోంది రామకృపా అనంతన్. తనకు ఇప్పుడు 53 ఏళ్లు. అయినా ఎక్కడా తగ్గేదే లేదంటోంది. నిత్యం కొత్త దనం ఉండేలా ప్రయత్నం చేస్తోంది. సమయం చిక్కితే చాలు రోడ్లను, వాటిపై రయ్ మంటూ పరుగులు తీసే వాహనాలను పరిశీలిస్తుంది. ఆ వెంటనే తన ఆలోచనలకు రెక్కలు తొడిగేలా అక్కడికక్కడే డిజైన్లు తయారు చేసేస్తుంది కృపా. వయసు శరీరానికే కానీ మనసుకు, ఆలోచనలకు, డిజైన్ చేసేందుకు అడ్డంకి కాదంటోంది. బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆమె..తనకు ఇష్టమైన ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చింది.
వాహనాలు ప్రధానంగా కార్లు, జీపులకు డిజైన్ చేసిన విధానం ఇతర వాహన తయారీదారులను, కంపెనీలను విస్మయానికి గురి చేసేలా చేసింది. మనం చేసే డిజైన్లు ఇతరులకంటే భిన్నంగా ఉండాలని అంటోంది. మహీంద్రాకు సంబంధించిన పాపులర్ వాహనాల మోడల్స్ కు సంబంధించిన డిజైన్లు అన్నీ కృపా అనంతన్ తయారు చేసినవే కావడం విశేషం. ప్రధానంగా యువతీ యువకుల నుంచి వయసు మళ్లిన వారు కూడా అత్యంత ప్రభావితం చేసిన మహీంద్రా థార్ డిజైన్ చేసింది కూడా ఆమె కావడం విశేషం. దీని తయారీ వెనుక ఓ కథ ఉంది. అదేమిటంటే తాను అడవిని, రోడ్లను పరిశీలిస్తూ వచ్చా. చీటా పరుగులు తీసే విధానం నాకు నచ్చింది. అందుకే నా మదిలో థార్ వాహనం రూపు దిద్దుకుంది అని తెలిపింది రామకృపా అనంతన్.
1977లో మహీంద్రా మహీంద్రా కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఆమె బొలేరో, స్కార్పియో, ఎక్స్ వైఎల్ఓ తో పాటు పలు వాహనాలకు ప్రాణం పోసింది . కృపా తయారు చేసిన డిజైన్ల కారణంగా మహీంద్రా వాహనాలు మార్కెట్ లో పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయి. అంతే కాదు ఆనంద్ మహీంద్రాకు కోట్లు కురిపించేలా చేశాయి. ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న కృపా అనంతన్ 2022లో తన మాతృ సంస్థ నుంచి నిష్క్రమించింది. క్రక్స్ స్టూడియోను స్థాపించింది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ లో డిజైన్ హెడ్ గా పని చేస్తోంది. ప్రస్తుతం ఓలా మార్కెట్ లో దూసుకు పోయేందుకు డిజైన్లు తయారు చేసే పనిలో పడింది రామ్ కృపా అనంతన్.
‘- మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ప్రధానం కాదు. మీరు ఎలా భిన్నంగా ఆలోచిస్తారనేది ముఖ్యం. మారుతున్న అభిరుచులను, వినియోగదారుల ఆలోచనలను , అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా మనల్ని మనం తయారు చేసుకోవడంలోనే సక్సెస్ దాగి ఉంటుంది అని అంటోంది కృపా – ప్రతి గీసే గీత వెనుక ఓ కథ ఉంటుంది. ఆ కథ వెనుక అంతు చిక్కని ఆలోచనలు ఉంటాయి. వాటికి ప్రాణం పోయాలంటే గీతలన్నింటిని ఒక చోటుకు చేర్చాలి. అది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ కష్టంలోనే సంతోషం దాగి ఉంటుంది. చేస్తున్న పని పూర్తయితే వచ్చే ఆనందాన్ని కోట్లల్లో కొలవలేం. అదే నా విజయానికి కారణం అంటోంది రామకృపా అనంతన్ – ‘