తన జీవితమే తన సందేశం
కాసుల కంటే విలువలే గొప్పవి
హైదరాబాద్ – తరగని ఆస్తులున్నా, లెక్కించ లేని కోట్లున్నా చివరకు మిగిలేది పేరు మాత్రమేనని గుర్తించారు రతన్ టాటా. అందుకేనేమో ఆయన అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే ఉన్నారు. అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపారు. ఎక్కడా డాబూ దర్పం ప్రదర్శించ లేదు. పేదలు, నిరుపేదలు, ధనవంతుల మధ్య అంతరాలు ఉండ కూడదని ఆయన ఆశించారు. విద్య విలువ తెలిసిన వ్యక్తి. దాతృత్వం పట్ల మమకారం పెంచుకున్న వ్యక్తి.
అంతకు మించి ఎంత ఇవ్వగలితే అంత మంచిదని నమ్మకం కలిగిన వ్యాపారవేత్త రతన్ టాటా. ఆయన సెలవంటూ వెళ్లి పోయారు. కానీ ఆయన అనుసరించిన విధానాలు, నేర్చుకున్న విలువలు, ఆచరించిన పద్దతులు..ఇవన్నీ ఎల్లప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసినా అందరినీ భేద భావం లేకుండా సమానంగా చూశారు. తమ కుటుంబంలో సభ్యులుగా పరిగణించారు. ఇది రతన్ టాటాకు ఉన్న గొప్ప సుగుణం. నష్టాల్లో ఉన్న వాటిని భుజానికి ఎత్తుకున్నారు. లాభం వచ్చింది కదా అని మరింతగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయలేదు.
తనను అవమానించాలని చూసిన బ్రిటీష్ కంపెనీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. నష్టాల్లో ఉన్న జాగ్వార్ , రోల్స్ రాయిస్ ను కొనుగోలు చేశారు. తిరిగి భారత దేశానికి ఉన్న సత్తా ఏమిటో చెప్పకనే చెప్పారు. అయినా ఎక్కడా రతన్ టాటా గర్వంగా చెప్పలేదు. నేర్చు కోవడం, కలిసి ఉండడం, పనిలో నిమగ్నం కావడం, నిబద్దతతో , మరింత నాణ్యవంతంగా , పారదర్శకంగా ఉండేలా చివరి దాకా ప్రయత్నం చేశారు.
సామాజిక బాధ్యత కింద వేల కోట్లు విరాళంగా ఇచ్చారు. తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు.
సమస్యలు చుట్టు ముట్టిన సమయంలోనూ సంయమనం పాటించారు రతన్ టాటా. దూర దృష్టి, సునిశిత పరిశీలన, నిజాయితీ, క్రమశిక్షణ ఆయన నుంచి నేర్చు కోవాల్సిన సుగుణాలు. ఈ సందర్బంగా ఆయన తన జీవితమే ఓ సందేశం అని చెప్పక తప్పదు. రతన్ టాటాకు మరణం లేదు. ఈ దేశం ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటారు. మన అందరి హృదయాలలో చిరస్మరణీయంగా. వినమ్రతతో కన్నీటి నివాళి …సర్..