మాడ వీధుల్లో భక్తులకు దర్శనం
తిరుపతి – తిరుపతి లోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో ఘనంగా రథ సప్తమి నిర్వహించారు. సూర్య ప్రభ వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాతంలో మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు సూర్య ప్రభ వాహనంపై శ్రీ కోదండ రామ స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
అదేవిధంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తిరుపతి ఎస్పీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.