సప్త వాహనాలలో దర్శనం
తిరుపతి – తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మాడ వీధుల్లో అమ్మ వారు ఊరేగారు. సూర్య ప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. సిరులతల్లి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మ వారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మ వారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు.
ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మ వారు వాహనాలలో విహరించారు. మాడ వీధులన్నీ అమ్మ వారి నామ స్మరణతో మారుమ్రోగింది.
సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అమ్మ వారిని విశేషంగా అభిషేకించారు. సాయంత్రం 6 గంటల నుండి అమ్మ వారు చంద్రప్రభ, గజ వాహనంపై దర్శనం ఇచ్చారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్య నారాయణ స్వామి వారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామి వారు అశ్వ వాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల బృందాల కోలాటాలు, చెక్కభజనలు, భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.