తీపి కబురు చెప్పిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్వే ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించారు. కొత్త కార్డులతో పాటు పాత కార్డుల్లో అదనంగా కుటుంబీకులు ఎవరైనా ఉంటే చేర్చుతామని స్పష్టం చేశారు. తొలుత కుల గణన పూర్తయిన వారికి అందజేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు కావాలని తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు.
తాము వచ్చాక అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, అర్హులై ఉంటే వెంటనే రేషన్ కార్డు జారీ చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందన్నారు మంత్రి.