వివరాలు నమోదు చేసిన పోలీసులు
అమరావతి – రేషన్ బియ్యం స్కామ్ కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తనకు చెందిన గో డౌన్ నుంచి 4 వేల టన్నుల రేషన్ బియ్యం మాయం కావడంపై ఆరా తీశారు. ఎవరికి పంపించారో చెప్పాలని అడిగారు. దీనికి తనకు తెలియదంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. తమను కావాలని టార్గెట్ చేశారంటూ పేర్ని నాని ఆరోపించారు.
కాగా రేషన్ బియ్యం స్కాంకు సంబంధించి పేర్ని జయసుధను పోలీసులు 2 గంటలకు పైగా విచారించారు. రేషన్ బియ్యం తరలింపులో ఏ1గా ఉన్నారు . లాయర్లతో కలిసి పోలీసు విచారణకు ఆమె హాజరయ్యారు. గోదాం నుంచి బియ్యం ఎక్కడికి తీసుకు వెళ్లారంటూ ప్రధానంగా ప్రశ్నించారు. గోడౌన్ లో స్టాక్ తగ్గడానికి గల ప్రధాన కారణం ఏమిటని ప్రశ్నించారు.
దీనికి సంబంధించి పేర్ని నాని భార్య తనకు ఏమీ తెలియదని, తాను అమాయకురాలినని చెప్పారు. కావాలని తనను వేధింపులకు గురి చేయడం మంచిది కాదన్నారు. ఇదిలా ఉండగా తమను అరెస్ట్ చేయొద్దంటూ మాజీ మంత్రి పేర్ని నాని కోర్టును ఆశ్రయించారు.