5 వికెట్ల తేడాతో పంజాబ్ సూపర్ విక్టరీ
బెంగళూరు – ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసింది. వర్షం కారణంగా అంపైర్లు 14 ఓవర్లకు కుదించారు. పంజాబ్ స్కిప్పర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయం సరైనదేనని నిరూపించారు బౌలర్లు. చాహల్ , యాన్సన్ బెంగళూరును కట్టడి చేశారు తమ బౌలింగ్ తో. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులకే పరిమితమైంది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ సైతం పోరాడింది. వధేరా దుమ్ము రేపాడు. తన జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ టోర్నీలో ప్రత్యర్థులకు వారి స్వంత గడ్డపై ఝలక్ ఇస్తూ అద్భుత విజయాన్ని సాధిస్తూ వస్తున్న ఆర్సీబీకి ఉన్నట్టుండి వారి స్వస్థలంలో మాత్రం చుక్కెదురవుతోంది. ప్రత్యర్థి జట్ల చేతిలో ఓటమి పాలవుతోంది.
టార్గెట్ ను ఛేదించడంలో నేహాల్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 19 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స్ లతో 33 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్ వుడ్ 14 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే భువనేశ్వర్ 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక బెంగళూరు జట్టులో బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. సాల్ట్ 4 రన్స్ చేస్తే, విరాట్ కోహ్లీ 1 పరుగుకే ఔట్ అయ్యాడు. లివింగ్ స్టోన్ 4, జితేష్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1 కి చాప చుట్టేశారు. టిమ్ డేవిడ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 26 బంతుల్లో 50 రన్స్ చేశాడు. 5 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టాడు. రజిత్ పటీదార్ 18 బంతుల్లో 23 చేశాడు. పంజాబ్ బౌలర్లలో యాన్సన్ 10 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీస్తే చాహల్ 11 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.