అన్నదానం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో పీఎంఎస్ ప్రసాద్
రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ పి.ఎం.ఎస్ ప్రసాద్ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కి అందజేశారు. ఈ సందర్బంగా ప్రసాద్ ను అభినందించారు.
ఇదిలా ఉండగా కలియుగ దైవంగా , కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల పుణ్య క్షేత్రం వెలుగొందుతోంది. కోట్లాది మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం కొలుస్తారు. తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయనను తలుచుకుంటే చాలు జీవితం ధన్యమై పోతుందని నమ్ముతారు. ప్రతి రోజూ వేలాది మంది స్వామి దర్శన భాగ్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు.
ప్రతి నిత్యం భక్తులు తమకు తోచిన మేరకు కానుకలు, విరాళాలు రూపేణా శ్రీవారి హుండీకి అందజేస్తారు. టీటీడీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రత్యేకించి లక్షలాది మంది భక్తుల ఆకలిని అన్నదానంతో తీరుస్తోంది. ఇందుకు సంబంధించి ట్రస్టును ఏర్పాటు చేసింది. అన్నదానంతో పాటు విద్య, వైద్యం, వసతి సౌకర్యాల కల్పన, సంస్కృతిని పరిరక్షించేందుకు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
అంతే కాకుండా ధార్మిక కార్యక్రమాలను చేపడుతోంది. దేశ వ్యాప్తంగా ధర్మ ప్రచార పరిషత్ ద్వారా హిందూ ధర్మం కోసం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా టీటీడీ అన్నదానం ట్రస్టుకు ఓ భక్తుడు ఏకంగా కోటికి పైగా విరాళం అందజేశారు.