37.6 లక్షల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిన జియో
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ కు షాక్
ముంబై – నిన్నటి దాకా టెలికాం రంగాన్ని శాసిస్తూ వచ్చిన ముఖేష్ అంబానీకి చెందిన ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకు కోలుకోలేని షాక్ తగిలింది. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొట్టిన దెబ్బకు ఠారెత్తింది. కేవలం ఒకే ఒక నెలలో 37.6 లక్షల మొబైల్ సబ్ స్క్రైబర్లను కోల్పోయింది.
గత నాలుగు నెలల్లో ప్లాట్‌ఫారమ్ నుండి మొత్తం 1.65 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు నిష్క్రమించారు. తనకు ఎదురే లేదంటూ భావిస్తూ వచ్చిన ముఖేష్ అంబానీ కంపెనీకి ఏం చేయాలో పాలుపోలేని స్థితిని ఎదుర్కొంటోంది. ప్రధానంగా ట్రాయ్ రూల్స్ ను లెక్క చేయకుండా మోనోపలీని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇష్టానుసారం టారిఫ్ లను ప్రకటిస్తూ జనం నెత్తిన టోపీ పెట్టింది.
ఇదే సమయంలో రిలయన్స్ కొట్టిన దెబ్బకు వొడాఫోన్, టాటా అడ్రస్ లేకుండా పోయాయి. ఒకానొక దశలో ఎయిర్ టెల్ కంపెనీ సైతం మూసేసే స్థితికి వెళ్లి పోయింది. కానీ సర్వీస్ అందించే విషయంలో సదరు కంపెనీ ఇప్పటికీ కచ్చితత్వాన్ని పాటించడంతో నిలదొక్కుకుంది.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ బలోపేతంపై ఫోకస్ పెట్టడం, టారిఫ్ లు తక్కువగా ఉండడంతో సబ్ స్క్రైబర్లు పెద్ద ఎత్తున రిలయన్స్ జియోను వదిలి వేశారు.