రైతన్నలపై దాడులు దారుణం
కేంద్ర సర్కార్ పై రేణుకా చౌదరి
హైదరాబాద్ – దేశాభివృద్దిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రైతుల పట్ల మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరుగాలం శ్రమించి ధాన్యం పండించే రైతుల పట్ల వివక్ష చూపడం దారుణమన్నారు.
తమ న్యాయ పరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేపట్టడం నేరం ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రైతులు కూడా ఈ దేశంలో భాగమేనని మోదీ గుర్తించాలన్నారు.
కేంద్రం కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు. ప్రతిపక్షాలన్నీ రైతులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు రేణుకా చౌదరి.
కోట్లాది మంది కడుపులు నింపుతున్న అన్నదాతల పట్ల ఇంత దారుణమైన స్థితికి దిగడం బాధాకరమన్నారు. వాళ్లు గనుక వ్యవసాయం మానేస్తే చివరకు ఆకలి కేకలతో అల్లాడాల్సి వస్తోందన్నారు.