ప్రజాస్వామ్యానికి పాతర ఈడీ జాతర
నిప్పులు చెరిగిన ఎంపీ రేణుకా చౌదరి
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. జాతీయ మీడియాతో మాట్లాడారు రేణుకా చౌదరి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు.
పార్లమెంట్ అన్నది ప్రజా దేవాలయం అని , అది కూడా ఇవాళ అపహాస్యం చేయబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాత్మకమైన సూచనలకు వేదిక కావాల్సిన సమయంలో కేవలం కులం, మతం ఆధారంగా జరిగే కార్యక్రమాలకు కేరాఫ్ గా మారడం దారుణమన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎక్కడ ఉందో అన్నది ప్రజలు ఆలోచిస్తున్నారని, ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. నాకు అనిపిస్తోంది ఏమిటంటే అది కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) కార్యాలయంలో బందీ అయ్యిందని అంటూ ఆరోపించారు రేణుకా చౌదరి.
మోదీ ప్రధానమంత్రినన్న విషయం మరిచి పోయారని, కేవలం ప్రచారానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా మారారంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ. ఒక రకంగా ఈ దేశంలో ప్రజా స్వామ్యం, రాజ్యాంగం రెండూ ప్రమాద స్థితిలోకి నెట్టి వేయ బడ్డాయని ఆవేదన చెందారు.