స్నపన తిరుమంజనం..ఆస్థానం..నివేదన నిర్వహణ
తిరుపతి – తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో కొలువైన శ్రీ సీతారాములు, లక్ష్మణ స్వామి వారికి రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 8.45 నుండి 9.30 గంటల వరకు శ్రీ కోదండ రామాలయం నుండి శ్రీ సీతారాముల సమేత లక్ష్మణ స్వామి వారి ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట (ఆర్‌ఎస్ గార్డెన్స్)కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆస్థానం, నివేదన నిర్వహించారు.
సాయంత్రం 5 గంటలకు స్వామి వారిని ఊరేగించారు. రాత్రి 7 గంటలకు ఈ ఊరేగింపు శ్రీ కోదండ రామాలయానికి చేరుకుంది.శ్రీ కోదండ రామ స్వామికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలు. ఈమె వందేళ్ల క్రితం స్వామి వారిని భక్తిశ్రద్ధలతో పూజించే వారు. 1910వ సంవత్సరం నుండి కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలను సొంత ఖర్చులతో నిర్వహించేవారు. తన తదనంతరం కూడా ఈ సేవలు కొనసాగాలనే తలంపుతో 1933వ సంవత్సరంలో కొంత స్థలాన్ని కోదండ రామాలయానికి విరాళంగా అందించారు.
ఈ భూమిలోనే ప్రస్తుతం ఎస్వీ బాలమందిరం, ఆర్‌ఎస్ గార్డెన్స్ ఉన్నాయి. కోదండరాముని భక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.