Saturday, April 5, 2025
HomeDEVOTIONALశ్రీవారి భక్తులకు అందుతున్న సేవలపై ఈవో స‌మీక్ష

శ్రీవారి భక్తులకు అందుతున్న సేవలపై ఈవో స‌మీక్ష

గదుల పరిశుభ్రత, కేటాయింపు కోసం సిబ్బందికి ప్రత్యేక యాప్

తిరుమల – కలియుగ దైవం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కల్పిస్తున్న సేవలు, భక్తుల నుండి వస్తున్న సూచనలు , ఫిర్యాదులపై టిటిడి ఈవో జే. శ్యామల రావు సమీక్ష నిర్వహించారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం, ఇంఛార్జీ సీవీఎస్వో వి. హర్షవర్థన్ రాజులతో కలసి పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలు సంతృప్తికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లలో భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీలో భక్తుల నుండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి సమగ్ర విశ్లేషణాత్మక నివేదిక రూపొందించాలన్నారు. లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసే కౌంటర్ల వద్ద భక్తులకు ఆలస్యం చేయకుండా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తిరుమలకు వచ్చే భక్తులకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలపై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టాలని, తద్వారా వారికి మరింతగా మెరుగైన సేవలు అందించ వచ్చని సూచించారు. తిరుమలలో రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు.

తిరుమలలోని పలు ప్రాంతాలు, కాటేజీలలో పరిశుభ్రతను పెంచేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించి, ఈ యాప్ పై అవగాహన కల్పించి తద్వారా వచ్చే ఫిర్యాదుల ద్వారా సమస్యలను పరిష్కరించి పరిసరాలు మరింతగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

భక్తులు టిటిడి వసతి గదులను ఎన్ని గంటలకు ఖాళీ చేస్తున్నారు, తిరిగి ఎన్ని గంటలకు గదులను భక్తులకు కేటాయిస్తున్నారనే సమగ్ర సమాచారం తెలిసేలా సిబ్బందికి యాప్ రూపొందించి, సదరు యాప్ పై అవగాహన కల్పించి భక్తులకు గదుల కేటాయింపులో ఆలస్యం చేయకుండా కేటాయించాలని అన్నారు.

తిరుపతిలో భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసిన తర్వాత తిరుమలకు సకాలంలో లగేజీని చేర్చి భక్తులకు అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి దర్శనం, వసతి సదుపాయాలు, అన్నప్రసాదాలు, క్యూలైన్లలో సదుపాయాలు, కల్యాణకట్ట, రవాణా, విజిలెన్స్ , పారిశుద్ధ్యం తదితర శాఖలపై ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో టిటిడి సీఈ టి.వి. సత్యనారాయణ తదితర పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments