భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్
చిత్తూరు జిల్లా – టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ కూటమి సర్కార్ పై ధ్వజమెత్తారు. నగరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజాపై ప్రశంసలు కురిపించారు. కూటమి సర్కార్ పై జగన్ రెడ్డి విసిరిన ఫిరంగి రోజా అని పేర్కొన్నారు. జగన్ మరోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, చిత్తూరు జిల్లాలో రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు భూమన.
గురువారం నగరిలో వైసీపీ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణితో పాటు ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి రెడ్డప్ప హాజరయ్యారు. ఈ సందర్బంగా సమావేశానికి అధ్యక్షత వహించిన భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రోజా నగరికి రాజా లాంటిదని కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకురాలు ఆమె అని కొనియాడారు. జగన్ మనసులో చెల్లిగా స్థిరపడ్డారు రోజా అని పేర్కొన్నారు. ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.
జగన్ బరువు 78 కేజిలైతే, తన గుండె కూడా 78 కేజీలేనని అన్నారు. ఆయనకు ద్వేషం అన్నది తెలియదన్నారు. ఎవరో పనికిమాలిన వారి కింద పని చెయ్యడం కంటే, ఉద్యమాల నుండి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండటం మేలు అన్నారు. రోజా అంటే నిప్పుల కొలిమి అని, మండే సూర్యడంటూ హెచ్చరించారు.