జనమే జెండా అభివృద్దే ఎజెండా
మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
చిత్తూరు జిల్లా – జనమే జెండాగా అభివృద్దే ఎజెండాగా తాము ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. మంగళవారం నగరి శాసన సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆమెకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఎండలో సైతం తనను ఆదరించినందుకు, అక్కున చేర్చుకున్నందుకు రుణపడి ఉంటానని అన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
తమ పార్టీ అధినాయకుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ది కోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఇందులో భాగంగానే అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకు వచ్చారని దీని ద్వారా లక్షలాది మంది పేదలు, లబ్దిదారులకు మేలు జరిగిందని చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి.
తాము తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థను కేంద్రం సైతం ప్రశంసించిందని తెలిపారు. పాలనా పరంగా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. కేవలం అబద్దాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు , కూటమికి జగన్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఆయన హయాంలో ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించారు ఆర్కే రోజా సెల్వమణి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మరోసారి బాబు , పరివారానికి షాక్ తప్పదన్నారు.