ప్రజా సంక్షేమం వైసీపీ లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి ఆర్కే రోజా
చిత్తూరు జిల్లా – సంక్షేమం..అభివృద్ది అనేవి తమ పార్టీకి రెండు కళ్లు లాంటివని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తాను ఎన్నికల బరిలో నిలిచిన నగరి శాసన సభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
ఓ వైపు ఎండలు మండి పోతున్నా ఎక్కడా తగ్గడం లేదు ఆర్కే రోజా సెల్వమణి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాను ఎమ్మెల్యేగా గెలిచాక, మంత్రిగా కొలువు తీరాక నగరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు శత విధాలుగా కృషి చేసినట్లు చెప్పారు.
ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలు వర్తింప చేయడం జరిగిందని అన్నారు ఆర్కే రోజా సెల్వమణి. నిండ్ర మండలానికి చెందిన ప్రజలు మూకుమ్మడిగా తనకు అపూర్వమైన రీతిలో స్వాగతం పలకడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
నియోజకవర్గ ప్రజలంతా తన పట్ల కురిపిస్తున్న ఆదరాభిమానాలను తాను ఎప్పటికీ మరిచి పోలేనని అన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి. ఆరు నూరైనా మరోసారి వైసీపీ జెండా ఎగుర వేస్తుందన్నారు. కూటమి పరాజయం పాలవడం పక్కా అని స్పష్టం చేశారు ఆర్కే సెల్వమణి.