బామ్మర్ది షోకు వెళితే ఎలా ..?
అమరావతి – ఏపీ మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా సెల్వమణి సీరియస్ అయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ వైపు హత్యలు, అత్యాచారాలు, దాడులు, కేసులతో అట్టుడికి పోతుంటే మరో వైపు బాధ్యత కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి అవేవీ పట్టించుకోక పోవడం పట్ల ఫైర్ అయ్యారు.
రాష్ట్ర ప్రజల కంటే ఎంటర్ టైన్మెంట్ షోలే ముఖ్యమని భావిస్తున్నాడని, అందుకే తన స్వంత బామ్మార్ది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న షోకు హాజరయ్యాడని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యలు పేరుకు పోయాయని, ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో ఏమీ లేదన్నారు.
చంద్రబాబు నాయుడుకు స్వంత ప్రచారంపై ఉన్నంత యావ ప్రజల సమస్యలు పరిష్కరించుదామన్న సోయి లేదని మండిపడ్డారు ఆర్కే రోజా సెల్వమణి. బద్వేల్‌లో ఇంటర్ అమ్మాయి దారుణంగా చనిపోతే కనీసం పట్టించు కోలేదన్నారు.
ఒక బాధ్యత కలిగిన సీఎం ఘటనా స్థలానికి వెళ్లి ఉండాల్సింది అన్నారు. కేవలం ఫోన్ ద్వారా సమాచారం తెప్పించుకుంటే చాలదన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
వీకెండ్‌లో హైదరాబాద్‌కి స్పెషల్ ఫ్లైట్‌లో ఎవరిని ఉద్దరించడానికి వెళ్లారని ప్రశ్నించారు. దీనిపై సీఎం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.