NEWSANDHRA PRADESH

కూట‌మి కుట్ర‌ల వ‌ల్లే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వాయిదా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా

చిత్తూరు జిల్లా – ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను కావాల‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నానికి తెర లేపార‌ని, కూట‌మి స‌ర్కార్ కావాల‌ని ఇబ్బందులు సృష్టించేందుకు ప్లాన్ చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొనే ప్ర‌మాదం ఉంద‌ని , ప్ర‌జ‌ల మ‌ధ్య భావోద్వేగాల‌ను రెచ్చ గొట్ట‌డం భావ్యం కాద‌ని ఆలోచించే త‌మ నాయ‌కుడు తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నార‌ని చెప్పారు.

ఒకప్పుడు రాష్ట్రంలో కుల రాజ‌కీయాల‌కు తెర లేపిన నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు మ‌త రాజ‌కీయాల‌కు శ్రీ‌కారం చుట్టార‌ని మండిప‌డ్డారు. అయినా ఆయ‌న చేసిన పాపాల‌ను తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌రుడే చూసుకుంటాడ‌ని అన్నారు.

ఎవ‌రు ప్ర‌జ‌ల వైపు ఉన్నారో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం, తాము ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన హామీల నుంచి డైవ‌ర్ష‌న్ చేసేందుకే చంద్ర‌బాబు స్కెచ్ వేశాడ‌ని ఆరోపించారు.