సినిమాలు చేసే వాళ్లకు పాలిటిక్స్ ఎందుకు..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
అమరావతి – వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే, ప్రజలు నానా కష్టాలు పడుతుంటే, ఇంకో వైపు తుపాను ప్రభావం వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటే బాధ్యత కలిగిన సర్కార్ చోద్యం చూస్తోందని ఆరోపించారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటూ నిలదీశారు. సోమవారం ఆర్కే రోజా సెల్వమణి మీడియాతో మాట్లాడారు.
ఓ వైపు బద్వేల్ లో అత్యాచారానికి గురైన యువతి చని పోతే పరామర్శించిన పాపాన పోలేదన్నారు. నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. ఇక ప్రజలు నమ్మి ఓటేసిన పాపానికి నందమూరి బాలకృష్ణ ఎంచక్కా షోస్, సినిమా షూటింగ్ లతో ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపించారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ ఎద్దేవా చేశారు. బాధ్యత కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు అన్నీ మరిచి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు వెళ్లారని, అక్కడ తన బామ్మర్ది నిర్వహించే షోలో పాల్గొన్నారని ఆరోపించారు.
అసలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు సినిమాలు చేసుకోక పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు ఆర్కే రోజా సెల్వమణి.