జగనే కావాలంటున్న జనం – రోజా
సీఎం చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్
తిరుపతి జిల్లా – మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి సర్కార్ పాలన గాడి తప్పిందన్నారు. దీంతో ప్రజలు ఆరు నెలలకే విసిగి పోయారని, తిరిగి సంక్షేమ పాలనను అందించిన జగన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అని కాపీ కొట్టి ప్రజల నెత్తిన శఠగోపం పెట్టారంటూ సీఎం చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు ఆర్కే రోజా.
గురువారం నగరి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్వసభ్య సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా పార్టీ చీఫ్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. తప్పుడు ప్రచారం వల్లనే తాము గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
కూటమికి చెందిన పార్టీలు ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారని ధ్వజమెత్తారు. ఆరు నెలలకే జనం నరకం అనుభవిస్తున్నారని వాపోయారు. జగన్ రెడ్డిని ఓడించినందుకు జనం బాధ పడుతున్నారని చెప్పారు. తాము ఉన్నప్పుడు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రయారిటీ ఇవ్వడం జరిగిందన్నారు. కోట్లాది రూపాయలు కేటాయించామన్నారు ఆర్కే రోజా. అన్ని వర్గాలను మోసం చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు.
కూటమి సర్కార్ వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎంపీ గురుమూర్తి. కరుణాకర్ రెడ్డి చిన్నప్పటి నుంచే ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందారని కితాబు ఇచ్చారు మాజీ మంత్రి రెడ్డప్ప.