లక్ష కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు
విద్యుత్ ఛార్జీలు పెంచితే పవన్ మౌనమేల
చిత్తూరు జిల్లా – మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చంద్రబాబు ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చాడని, ఇప్పటికే 7 నెలల్లో ఏకంగా లక్ష కోట్లు అప్పులు చేశాడని ఆరోపించారు. 6 నెలల్లోనే రూ. 15,500 కోట్ల విద్యుత్ ఛార్జీలను ప్రజలపై కూటమి సర్కార్ భారం వేసిందని మండిపడ్డారు.
విద్యుత్ చార్జీలు పెంచుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిప్పులు చెరిగారు. సినిమాలలో నటించినట్టుగానే ఇక్కడ కూడా నటించాలని చూస్తే జనం చూస్తూ ఊరుకోరని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు హామీలకు ష్యూరిటీ లేదు, ఆయన మాటలకు వారంటీ లేదంటూ ఎద్దేవా చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
కరెంట్ చార్జీలు, విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు , ఇసుక రేట్లు ఇలా అన్నీ పెంచుకుంటూ పోయారని ఇక మిగిలింది గాలి మాత్రమే ఉందన్నారు. దానిపై కూడా ఛార్జి విధిస్తారేమో చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.
ఆరేడు నెలల్లోనే లక్ష కోట్ల అప్పు చేసి ఏం చేశారో , ఏం అభివృద్ది సాధించారో ప్రజలకు చెప్పాలని ఆర్కే రోజా సెల్వమణి డిమాండ్ చేశారు.